నాటింగ్‌హామ్‌: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును అభిమానులతో పంచుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఇంగ్లిష్‌ జట్టుకు చివరి వరకూ పోటీ ఇచ్చి 31 పరుగులతో కోహ్లీ సేన ఓడిపోయింది. అనంతరం ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్‌ 159 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టీమిండియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు కూర్పు సరిగా లేదంటూ కోహ్లీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ సోమవారం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో భావోద్వేగమైన పోస్టు చేశాడు. ‘కొన్ని సార్లు మేము ఓడిపోతాం.. మరికొన్ని సార్లు నేర్చుకుంటాం. మాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వదిలేయవద్దు.

మీ నమ్మకాన్ని ఒమ్ము చేయమని మేము వాగ్దానం చేస్తున్నాం. ఎత్తుపల్లాలు సహజం’ అని పేర్కొన్న కోహ్లీ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. రెండో టెస్టులో వెన్నునొప్పితో గాయపడిన కోహ్లీ మూడో టెస్టు కోసం ఎలా సన్నద్ధమౌతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఈ నెల 18న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది.

Leave a Reply