బీజేపీ పెద్దాయనగా సుపరిచితుడు అద్వానీ రాజకీయ జీవితం ముగిసిపోవటం లేదు. 75ప్లస్ లో ఉన్న ఆయన వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీలో ఉన్న రూల్స్ ను మార్చటమే అద్వానీ మరోసారి బరిలోకి దిగటానికి కారణం. తాను గాంధీనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నట్లుగా అద్వానీ తనతో స్వయంగా చెప్పినట్లుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా వ్యాఖ్యానించారు.

మొన్నటి వరకూ బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం 75 ఏళ్లు దాటిన నేతలు ఎవరూ ఎన్నికల బరిలోకి దిగటానికి అనర్హతగా ఉండేది. కానీ.. ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప బరిలోకి దిగటానికి పార్టీలో ఉన్న నిబంధన అడ్డుగా మారింది. 75ఏళ్లు పైబడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్నది బీజేపీ రూల్.

యడ్యూరప్పను బరిలోకి దించేందుకు వీలుగా పార్టీ నిబంధనను మార్చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీ సైతం తాను వచ్చే ఏడాది జరిగే గాంధీ నగర్ బరిలో దిగుతారని ఆయన చెప్పినట్లుగా వాఘేలా చెప్పారు. మోడీ జమానా మొదలయ్యాక.. అద్వానీ ప్రాభవం అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ పూర్తిగా తగ్గిపోయింది.

కొన్ని సందర్భాల్లో అద్వానీ విషయంలో మోడీ వ్యవహరించిన వైఖరితో అద్వానీ హర్ట్ అయ్యారని.. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీలో దిగరన్న భావన వ్యక్తమైంది. కానీ.. తాజాగా పార్టీలో మార్చిన రూల్ నేపథ్యంలో గాంధీనగర్ బరిలో నుంచి అద్వానీ ఉంటారన్న విషయం తాజాగా స్పష్టమైనట్లే. మొత్తానికి సార్వత్రిక బరిలో మరోసారి పెద్దాయన పోటీకి దిగనున్నారన్న మాట.

Leave a Reply