పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటిపోయినా.. ఆయన ప్రజల్లోకి రాలేదని, ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నా.. పెద్దగా స్పందించ డం లేదని అంతా అనుకున్నారు. షూటింగులు, సినిమాలకే పవన్ సమయం సరిపోతోందని, ఆయనకు రాజకీయాలు ఎందుకు అన్నవారు కూడా ఉన్నారు. ఇక, ఇంకొందరు ముందడుగు వేసి.. ఆయన ట్విట్టర్ రాజకీయాలకే పరిమితమని వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు. మరి ఇంత మంది ఇన్ని అన్నా.. పవన్ అప్పట్లో చలించలేదు. దీంతో అటు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, విపక్షం వైసీపీ అధినేత జగన్ కానీ.. ఇక, రాష్ట్రంలో తమకు తిరుగేలేదని అనుకున్నారు. పవన్ వచ్చినా వేస్టేనని అనుకున్నారు. కానీ, ఇంతలోనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు.

తాను ఎప్పుడు జనంలోకి రావాలని అనుకున్నాడో అప్పుడే వచ్చాడు. ఎప్పుడు పర్యటన ప్రారంభించాలని అనుకున్నాడో అప్పుడే ప్రారంభించా డు. అంతేకాదు… రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇవ్వని విధంగా ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాడు. అంటే.. నేను అది చేస్తాను.. ఇది చేస్తాను.. మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాను అని చెప్పిన నాయకులను మనం ఎందరినో చూశాం. కానీ, పవన్ ఆవిధంగా చెప్పడం లేదు. వ్యూహాత్మకమైన హామీలనే గుప్పిస్తున్నాడు. తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తానో చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు, ముఖ్యంగా మహిళలకు ఆయన ఇస్తున్న రెండు ప్రధాన హామీలు పవన్‌ను ఇప్పుడు మహిళా పక్షపాతిగా మార్చేశాయి. వీటిలో ప్రధానమైంది.. మహిళలకు అత్యంత కీలకమైన 33% రిజర్వేషన్లకు తాను మద్దతిస్తానని చెప్పడం. అదేవిధంగా.. ఇంటింటికీ రూ.3500 లకు తక్కువ కాకుండా నగదు బదిలీ చేస్తామని చెప్పాడు. అదేవిధంగా ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పాడు.

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని తమ మ్యానిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. బీసీలకు 5% పైబడి రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కూడా పొందు పరుస్తున్నామని, కాపు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే అంశం కూడా ఉంటుందని పవన్‌ తెలిపారు. మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ అందిస్తామన్నారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తున్నారని, దీనిని అడ్డుకోగలిగితే ఉచిత గ్యాస్‌ సాధ్యమేనని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.1కే కిలో బియ్యం ఇస్తుంటే వాటిని తీసుకోవడానికి ఇష్టపడనివారు రూ.3, 4లకుడీలర్‌కే అమ్మేస్తుంటే వాటిని రీసైకిల్‌ చేసి కాకినాడ పోర్టు ద్వారా కిలో రూ.23 చొప్పన ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఇలాంటివి అరికట్టడానికి సబ్సిడీ ద్వారా వస్తువులు అందించే విధానానికి స్వస్తి పలికి నేరుగా కుటుంబంలోని మహిళ పేరున నెలనెలా రూ.2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.

నిజానికి ఇప్పటి వరకు నాయకులు ఎవరూ కూడా ఇలా వ్యవహరించలేదు. నిజాయితీగా.. నిఖార్సుగా.. ఆచరణాత్మకమైన ధోరణిలో తన హామీలను ప్రకటిస్తుండడంతో ఇప్పుడు పవన్ ఒక ప్రభంజనంగా దూసుకుపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు లేని అనూహ్యమైన మద్దతు అన్ని వర్గాల నుంచి పవన్‌కు ఇప్పుడు లభిస్తుండడం గమనార్హం. మరి ఈ హామీలతో పవన్‌ ప్రజలకు నమ్మకం కలిగిస్తే ఆయన అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదుకదా!!? ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply