తెలంగాణ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతున్నారా?  ముందస్తు ఎత్తుగడలో ఉన్న కేసీఆర్ మరో రెండు రోజుల్లో ఇందులో భాగంగా కీలక ప్రకటనలు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేద ప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు – రైతుకు దన్నుగా ఉండే బీమా – స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను స్వాతంత్ర్య దినోత్సవమైన బుధవారం నుంచి సర్కారు చేపడుతోంది. దీనికి తోడుగా రెండు పాత పథకాలను అమల్లోకి తేనున్నారు.  ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను గ్రామాలకు అందించనున్నారు. పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా పంద్రాగస్టు నాడు అన్ని గ్రామాలలో ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే ఓ వైపు ఎన్నికల మూడ్ ను తెచ్చేసిన గులాబీ దళపతి ఇందులో కీలక పరిణామంగా సోమవారం రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా రెండు రోజుల తర్వాత మూడు కీలక పథకాలను ప్రకటించనున్నారు. ప్రజలందరికీ కంటిచూపు బాగుండాలనే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని చేపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాగారైతు బీమా పథకం కూడా ఇదే రోజు నుంచి ప్రారంభం కానుంది. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం.. కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. మంత్రులు – అధికారులు – రైతు సమన్వయ సమితి నేతలు.. ఇందులో చురుకైన పాత్ర పోషించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలు చేయనున్నారు. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో – పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీతో బడుగువర్గాలకు ఆర్థికసహాయం అందించే పథకాన్ని ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా ఆరోజు జిల్లాకు వందమంది లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్ గా మంచినీటి సరఫరాను పంద్రాగస్టునాడే అందించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు పూర్తిచేశారు. మరోవైపు రాష్ట్రంలోని 12751 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నెలపాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. స్థూలంగా ఎన్నికలు ఎదుర్కుంటే…ఎలాంటి పథకాలు – ప్రకటనలు చేస్తారో అదే తరహాలో సీఎం కేసీఆర్ పంద్రాగస్టు వరాలు ఉంటాయని చర్చ జరుగుతోంది.

Leave a Reply