Getty Images అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఘాటుగా సమాధానమిచ్చారు. తన నేతృత్వంలోని న్యాయ శాఖ రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలుకొట్టారు.

అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ న్యాయశాఖపై పట్టు సాధించలేకపోతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనిలా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు.

2016 ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన కేసుల విచారణ విషయంలో ట్రంప్ న్యాయశాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఆ నేపథ్యంలోనే ఆయన ఆ శాఖపై తీవ్రస్థాయిలో మండిపడడం, అటార్నీ జనరల్ అందుకు ప్రతిస్పందించడం జరిగాయి.

Getty Images ట్రంప్, జెఫ్ సెషన్స్

ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన ప్రచారానికి మద్దతుగా నిలిచిన సెషన్స్ ‘రష్యా జోక్యం’ కేసు విచారణ నుంచి తప్పుకొని తన డిప్యూటీ రాడ్ రోజెన్‌స్టీన్‌కు అప్పగించారు.

ప్రస్తుతం స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ మ్యూలర్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు విచారణకు ట్రంప్ ఆటంకాలు కల్పిస్తున్నారా అనే కోణంలో మ్యూలర్ దర్యాప్తు చేస్తున్నారని వినిపిస్తోంది. దీంతో సెషన్స్.. విచారణ నుంచి తప్పుకొని వీరికి అప్పగించడంపై ట్రంప్ తరచూ మండిపడుతున్నారు.

ట్రంప్ నేరుగా మాట్లాడే మాటల్లోను, ట్విటర్‌లో కూడా ఈ ఆగ్రహం కనిపిస్తోంది.

ట్రంప్ తీరుపై సొంత పార్టీ నేతల నుంచి భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. అటార్నీ జనరల్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని, తాము అటార్నీ జనరల్ పక్షం వహిస్తామని పలువురు రిపబ్లికన్‌లు చెబుతున్నారు.

ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక సెనేటర్లు మాత్రం నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికల తరువాత ట్రంప్.. సెషన్స్‌పై ఆగ్రహిస్తే అప్పుడు తాము మద్దతుగా రాగలమని సూచనప్రాయంగా తెలిపారు.

 • స్టార్మీ డేనియల్స్: ట్రంప్ ఆ విషయం చెప్పొద్దని బెదిరించారు
 • ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

  ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్’ కార్యక్రమంలో భాగంగా ట్రంప్ ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ”తనకు అప్పగించిన న్యాయశాఖపై ఏ రోజూ పట్టు సాధించలేకపోయినా ఒక అటార్నీ జనరల్‌ను నేను నియమించాను” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  రష్యా జోక్యం వ్యవహారంలో మాట్లాడుతూ.. ”జెఫ్ సెషన్స్ అలా ఈ కేసు విచారణ నుంచి తప్పుకుని ఉండాల్సింది కాదు. కనీసం నాకు ముందే చెప్పాల్సింది(నియామకానికి ముందు)” అని చెప్పారు.

  ”చివరకు నా శత్రువులు కూడా ‘ఏం మనిషండీ ఈయన?’ అంటున్నారు” అని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

  ”ఎన్నికల ముందు నా ప్రచారం సమయంలో ఆయన నాకు మద్దతుగా ఉన్నారు. రష్యాతో కుమ్మక్కేమీ లేదని ఆయనకు కూడా తెలుసు. ఆయన నాకు నమ్మకస్తుడని భావించే ఆయన్ను అటార్నీ జనరల్‌గా నియమించాను” అని ట్రంప్ అన్నారు.

  • పోర్న్ స్టార్‌కు దాదాపు రూ.1.35 కోట్లు చెల్లించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ఇప్పుడే ఎందుకీ వివాదం?

   గత కొద్ది రోజులుగా రష్యా కేసు విచారణతో సంబంధం ఉండేలా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ క్యాంపెయిన్ మాజీ మేనేజర్ పాల్ మనాఫోర్ట్ పన్నులు, బ్యాంకులను మోసగించిన కేసుల్లో నిందితుడిగా తేలారు.

   మరోవైపు పన్ను ఎగవేత, బ్యాంకులను మోసగించడం, ప్రచార ఆర్థిక వ్యవహారాల నిబంధనల ఉల్లంఘన విషయంలో ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్ తన నేరాన్ని అంగీకరించారు.

   ట్రంప్‌తో తమకు శృంగార సంబంధాలున్నాయని చెప్పుకొంటున్న ఇద్దరు మహిళల నోరు మూయించేందుకు వారికి రహస్యంగా డబ్బు చెల్లించాలని ట్రంప్ తనకు సూచించారని కోహెన్ తన వాంగ్మూలంలో చెప్పారు.

   ఇది ప్రచార ఆర్థిక వ్యవహారాల నిబంధనల ఉల్లంఘన కిందకొస్తుంది.. అయితే, ట్రంప్ మాత్రం తానేమీ చట్టాలను ఉల్లంఘించలేదంటూ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

   ఇలా వరుస న్యాయ వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకుంటుండడంతో ట్రంప్ ఆగ్రహానికి గురవుతున్నారు.

   అయితే, దేశంలో సంక్షోభం తలెత్తనుందని భావిస్తే తప్ప న్యాయశాఖ సాధారణంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా అభియోగాలు మోపకపోవచ్చు.

   అలాగే, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రత్యర్థులు ఆయనపై అభిశంసన అస్త్రాన్నీ ప్రయోగించే అవకాశాలు లేవన్నది పలువురి మాట.

Leave a Reply