దిల్లీ: రూపాయి మరింతగా పతనమైంది. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి… డాలరుతో మారకపు విలువ రూ.70కి చేరిపోయింది. టర్కీలో ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్‌ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు మరింతగా పడిపోయి రూ.70.08 పైసల వద్ద జీవన కాల కనిష్ఠానికి చేరింది. నిన్న రూపాయి మారకపు విలువ రూ.69.93 పైసల వద్ద ముగిసింది. నేటి పతనంతో 2018లో రూపాయి విలువ పది శాతం తగ్గిపోయినట్లయింది. యూఎస్‌ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీనపడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల లాభంతో 37777.96 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11402.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply