ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు.. ప్రతిసారీ వదంతులు ఈసారి శాశ్వతంగా దూరం చెన్నై: కరుణానిధి ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి ఆయన గురించి వదంతులు వ్యాపిస్తూనే ఉండేవి. ఇది నిన్నా మొన్నటి నుంచి కాదు. సుమారు 15ఏళ్ల క్రితం నుంచే అలాంటి వార్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వినిపించిన ప్రతిసారీ డీఎంకే కార్యకర్తలు అల్లర్లకు పాల్పడటం, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం వంటి పరిణామాలు కూడా జరిగాయి. 2012 డిసెంబరు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వదంతులు వ్యాపించాయి. అప్పట్లో కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇలా జరగడంతో స్వయంగా ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఖండించారు. 2014 డిసెంబరు 27న నడుం నొప్పితో కరుణానిధి ఆస్పత్రికి వెళ్లగా ఆయనకు గుండెపోటు వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన్ను చూసేందుకు అన్నా అరివాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అప్పటి డీఎంకే ప్రధానకార్యదర్శి అన్బళగన్‌, కోశాధికారి ఆర్కాడు వీరాస్వామి పలు వివరణలు ఇచ్చి వదంతులను అదుపులోకి తీసుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబరు 26న ప్రత్యేక పోలీసు దళాలను సిద్ధంగా ఉండాలంటూ డీజీపీ ఆదేశించడంతో కరుణానిధి ఆరోగ్యం గురించి మరోసారి వదంతులు వ్యాపించాయి. కొద్దిరోజులకే అక్టోబరు 19న కరుణానిధి ‘మురసొలి’ కార్యాలయానికి విచ్చేశారు.

2016 అక్టోబరు 10న కరుణానిధి ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు 13 రోజుల తర్వాత డీఎంకే ముగింపు పలికింది. అలర్జీ కారణంగా ఆరోగ్యం దెబ్బతిందని, అందువల్ల ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని అక్టోబరు 24న డీఎంకే అధిష్ఠానం వివరణ ఇచ్చింది. గతంలో పలుమార్లు కరుణ అనారోగ్యానికి గురైనప్పటికీ వారం రోజులకంతా క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే 2016 అక్టోబరు తర్వాత ఆయన దాదాపు గోపాలపురం నివాసానికే పరిమితమయ్యారు.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పలు పార్టీల నేతలు గోపాలపురం నివాసానికి వెళ్లి స్టాలిన్‌ను కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత డీఎంకే తరఫున జరిగిన పలు కార్యక్రమాలు, సమావేశాలకు కరుణానిధి హాజరు కాలేదు. డిసెంబరు 1న కరుణానిధి మైలాపూరులోని కావేరి ఆస్పత్రిలో చేరడంతో మరోమారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

న్యూట్రిషన్‌ లోపం, డీహైడ్రేషన్‌ కారణంగా ఆయన చేరినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారం తర్వాత ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆయనకు ఇంట్లోనే వైద్య చికిత్సలు కొనసాగించారు. 15వ తేదీ రాత్రి 11.10 గంటలకు మళ్లీ కరుణానిధిని కావేరి ఆస్పత్రిలో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు గొంతుకు అమర్చిన ట్యూబ్‌ ద్వారా ఆక్సిజన్‌ అందించేందుకు ట్రాక్యోస్టమీ చేశారు.

తర్వాత డిశ్చార్జి కాగా ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై తరచూ పుడుతున్న వదంతులను కట్టడి చేసేలా ఆయన ఫొటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు సామాజికమాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రాక్యోస్టమీ ట్యూబ్‌ మార్పిడి కోసం ఆయన్ను కొన్నిసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కరుణానిధి ఆరోగ్యం గురించి మళ్లీ పలు విధాలైన ప్రచారం జరిగింది.

గత నెల 27వ తేదీన రాత్రి దాటాక పరిస్థితి విషమించడంతో కావేరి ఆస్పత్రికి మరోమారు తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.

Leave a Reply